కడప స్టీల్ ప్లాంట్‌ పేరును ఏపీ ప్రభుత్వం మార్చింది. ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పోరేషన్ పేరును వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్‌గా నామకరణం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.

ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 వారాల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసి, శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

రూ.15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టామని.. మూడేళ్లలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.