ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 1వ తేదీ నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. క్యాంటీన్ల మూసివేతతో తమకు పని లేకుండా పోయిందని కార్మికులు కూడా వాపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

అన్నా క్యాంటీన్ల మూసివేసిన తర్వాత దాని స్థానంలో వైఎస్ఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి వీటిని ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయ పాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 1వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు మూతపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను  గతంలోని చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసింది. 5 రూపాయలకే పేదవారికి ఈ క్యాంటీన్లలో భోజనం  లభించేది. వీటి మూసివేత వలన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది.

అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందాయి.  ఇక అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై స్పష్టత రావాల్సివుంది. అయితే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు అన్నా క్యాంటిన్లు మూసివేతపై ఆందోళనకు దిగారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్లను ప్రభుత్వం మూసివేయడం దారుణమంటూ ఆరోపించారు.