మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. జగనన్న కాలనీలకు 5 శాతం స్థలం
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త లేఅవుట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వేసే ప్రైవేటు లే అవుట్లలో 5 శాతం భూమిని వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు (YSR Jagananna housing scheme) కేటాయించాలని ఆదేశించింది
ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త లేఅవుట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వేసే ప్రైవేటు లే అవుట్లలో 5 శాతం భూమిని వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్ట్‌కు (YSR Jagananna housing scheme) కేటాయించాలని ఆదేశించింది. ఇలా భూమి ఇవ్వలేకపోతే ప్రాథమిక విలువపై ఆ స్థలానికి డబ్బులు చెల్లించాలని తెలిపింది. లే అవుట్‌లో తీసుకున్న 5 శాతం భూమిని.. వైఎస్సార్ జగనన్న కాలనీల ద్వారా పేదలకివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2017 జూలై 18న ఇచ్చిన జీవో 275కు సవరణ చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రైవేట్ లే అవుట్ యజమానులు, అభివృద్దిదారులు 5 శాతం భూమిని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతి లే అవుట్‌లో సామాజిక అవసరాల కోసం కేటాయిస్తున్న 10 శాతం స్థలానికి ఈ 5 శాతం అదనంగా కేటాయించాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. నిర్మించే లే అవుట్‌లలో భూమిని ఇవ్వలేకుంటే.. లే అవుట్‌కు 3 కి.మీ పరిధిలో అంతే విస్తీర్ణంలో భూమిని ప్రభుత్వవానికి కొనివ్వాలనే నిబంధన విధించింది. ఒక వేళ అలా కుదరని పక్షంలో 5 శాతం భూమి ధరను (లేఅవుట్‌లో ప్రాథమిక విలువ) సంబంధింత మున్సిపాలిటీ లేదా పట్టణ అభివృద్ది సంస్థకు చెల్లించాలని పేర్కొంది.
ఓటీఎస్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ..
పేదలకు ఉచితంగా ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఓటీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓటీఎస్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయడు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీలాగా వైసీపీ ప్రజలను మోసం చేయదని అన్నారు. తాను ఎక్కడా అబద్దాలు మాట్లాడలేదని తెలిపారు. ఈ విషయంలో ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడితో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఓటీఎస్ అనేది బలవంతం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్వతహాగా ముందుకు వచ్చే వారికి మాత్రమే ఓటీఎస్ అమలు చేస్తానమి స్పష్టం చేశారు. పేదవారికి స్వంత ఇళ్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. చంద్రబాబు హాయంలో ఇది ఎందుకు చేయలేకపోరని ప్రశ్నించారు. పేదవారి కష్టం, బాధ చంద్రబాబు నాయుడుకి తెలియదని ఆరోపించారు. ధనవంతులు, పెద్దవారి గురించే పట్టించుకుంటారని విమర్శించారు.