ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసేందుకు గాను పరిపాలనా యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలోకి ఆ జిల్లాలోని మరో 13 మండలాలను చేరుస్తూ పురపాలకశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 13 మండలాల్లోని 431 గ్రామాలను వీఎంఆర్డీఏలోకి విలీనం చేస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి నోటిఫికేషన్ విడుదల చేశారు.  

నర్సీపట్నం, నాతవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, రోలుగుంట, గొలుగొండ, కోటవురట్ల, మాకవరపాలెం, దేవరాపల్లి, కె.కోటపాడు, రావికమతం, మాడుగుల, చోడవరం మండలాలను వీఎంఆర్డీఏలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త మండలాల్లోని 2,028,19 హెక్టార్ల భూమి చేరికతో వీఎంఆర్డీఏ పరిధి 7,328 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.