పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. 

అంతకుముందు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ జడ్జి బెంజ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది.

ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. ఎవరికీ ఇబ్బందులు లేకుండా.. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.

Also Read:కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం: సీఎస్‌కి లేఖ రాయనున్న నిమ్మగడ్డ

కాగా, ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ తమ వాదనలు వినిపించాయి.

మంగళవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసి.. గురువారం వెలువరించింది.