వ్యవసాయానికి ఉచితంగా అందించే విద్యుత్ వినియోగం గురించిన వివరాలు తెలుసుకునేందుకు జగన్ సర్కార్ చేపట్టిన స్మార్ట్ మీటర్ల బిగింపుపై నారా లోకేష్ సీరియస్ కామెంట్స్ చేసారు.  

అమరావతి: వ్యవసాయ మోటార్లకు మీటర్లు బింగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పక్కనే వున్న తెలుగురాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మీటర్ల బిగింపుకు సిద్దమయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సాకుగా చూపి 2022-23 నుంచి రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం పేరిట కొత్త నాటకానికి జగన్ సర్కార్ తెరతీసిందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. వ్యవసాయానికి రైతులు వినియోగించే విద్యుత్ ఉచితమే అయినప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకని టిడిపి ప్రశ్నిస్తోంది. తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవసాయ మోటార్లకు మీటర్ల వివాదంపై ఘాటుగా స్పందించారు. 

''మాట మార్చి..మడమ తిప్పి.. జగన్ మోసపు రెడ్డి చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతాం. నాడు టిడిపి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుందని అవాస్తవ ప్రచారం చేసిన జగన్ రెడ్డి నేడు రైతుల మెడకి మీటర్ల ఉరి తాడు బిగిస్తున్నాడు'' అంటూ నారా లోకేష్ ఆరోపించారు. 

ఇదిలావుంటే వైసిపి ప్రభుత్వం మాత్రం విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి నికరంగా రైతులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారో ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా విద్యుత్ మీట్లర్ల ఏర్పాటుకే జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

ఇటీవలరాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్లలకు సంబంధించి ఆరు నెలల్లో విద్యుత్ మీటర్లను బిగించాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన సొమ్మును ప్రభుత్వమే భరిస్తూ ఆ సబ్సిడీ మొత్తాలను రైతుల ఖాతాలకే నేరుగా డిబిటి కింద జమ చేస్తుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను కోరారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో 26వేల వ్యవసాయ కనెక్షన్ లకు గానూ 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకున్నారని డిస్కంలు లెక్కలు వేశాయని తెలిపారు. దాని ప్రకారం విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. అయితే ఇదే జిల్లాల్లో విద్యుత్ మీటర్లను భిగించిన తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు గానూ 67.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించినట్లు నిర్థిష్టంగా గుర్తించామని మంత్రి వివరించారు. 

ఇలా మీటర్లు భిగించడం వల్ల నికరంగా ఎంత విద్యుత్ ను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారో తేలిందని మంత్రి పేర్కొన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలుసుకునేందుకే విద్యుత్ మీటర్లను ఏర్పాటుచేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.