దయనీయ స్థితిలో టీడీపీ .. ఫోన్ ట్యాపింగ్ పథకం చంద్రబాబుదే, తెలుగుదేశం హయాంలో ఈ పనులే : సజ్జల వ్యాఖ్యలు
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు పథకమని .. తెలుగుదేశం హయాంలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్‌లు చేశారని ఆయన ఆరోపించారు.

రాజధానిపై పచ్చమీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడుగడుగునా ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని.. చంద్రబాబు అమరావతి భూముల ధరలు పెంచుకుని ప్రయోజనం పొందాలనుకున్నారని సజ్జల ఆరోపించారు. సీఎంగా వుండి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యహరించారని.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశంతో ఆయన లబ్ధిపొందాలని చూస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని.. జగన్ ప్రజలు అవసరాలు తీర్చడంపైనే దృష్టి పెట్టారని సజ్జల తెలిపారు.
చంద్రబాబు హయాంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్‌లు చేశారని ఆయన ఆరోపించారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశాక చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించలేదని సజ్జల దుయ్యబట్టారు. అప్పటి మంత్రి నారాయణతో కమిటీ వేసి వారంలో రాజధానిని ప్రకటించారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. అమరావతిని బంగారు గుడ్లుపెట్టే బాతులా మార్చాలని అనుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు బినామీల పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు.
Also REad: ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాకాని కౌంటర్
ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిపై కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. టెంపరరీ బిల్డింగ్‌లు, సగం రోడ్లు వేసి వదిలేశారని ఆయన చురకలంటించారు. చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా మార్చుకున్నారని.. దోచుకోవడం ఒక్కటే చంద్రబాబుకు తెలుసునని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ వచ్చాక చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లారని.. రియల్ డెవలప్‌మెంట్ ఎలా ఉంటుందో సీఎం చూపిస్తారని అన్నారు. చంద్రబాబు అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్ట్‌లను జగన్ పూర్తి చేస్తున్నారని సజ్జల తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక ఆంతర్యమేమిటో అందరికీ తెలుసునని పరోక్షంగా కోటంరెడ్డిపై ఆయన విమర్శలు చేశారు. వైసీపీలోని వివిధ శాఖల క్రియాశీలత,పార్టీ ఏర్పాటు, విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడంపై జగన్ సమీక్షిస్తున్నారని సజ్జల తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు పథకమని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా టీడీపీ దయనీయ స్థితిలో ఉందని.. అందుకే లేనిపోనివి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజలతో మాట్లాడే పాయింట్లు లేకపోవడంతో టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.