విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న శిశు మరణాలపై ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆందోళన వ్యక్తం చేసారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖను ఈ మరణాలపై నివేదిక కోరడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలికి వచ్చింది.
విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలపై ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhushan harichandan) ఆందోళన వ్యక్తం చేసారు. షెడ్యూల్డ్ కులాల, గిరిజన ప్రాంతాల పాలనాధికారి హోదాలో ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలపై గవర్నర్ దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలోని ఏజెన్సీ (visaka agency) ప్రాంతాల్లో భారీగా చోటుచేసుకుంటున్న శిశు మరణాల (child deaths) గురించి తెలుసుకున్న గవర్నర్ తన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను ఇందుకు సంబంధించి సంబధిత ప్రభుత్వ శాఖ నుండి నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆదారంగా తక్షణ చర్యల కోసం ఆదేశాలు జారీ చేసారు.
విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలం పాతరూడకోటలోొ (patharudakota) రోజురోజుకు శిశు మరణాల సంఖ్య పెరుగుతుండటంపై గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఆందోళన చెందారు. దీంతో గవర్నర్ ఆదేశాలతో ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఈ శిశు మరణాలు, నివారణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ (tribal welfare department) వెంటనే స్పందించి శిశు మరణాలకు గల కారణాలను తెలుపుతూ ఓ నివేదికను రాజ్ భవన్ కు పంపింది.
గిరిజన సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం... పాతరుడకోట గ్రామంలో పలు గిరిజన తెగలకు చెందిన 138 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2018 మే నుండి ఇప్పటివరకు ఈ గ్రామంలో 14 మంది శిశువులు మృతి చెందారు కేవలం గత తొమ్మిది నెలల్లోనే ఎనిమిది శిశు మరణాలు నమోదుకాగా, అన్ని మరణాలు పుట్టిన మూడు నెలల్లోనే జరిగాయి.
read more వీఆర్వోలకు అధికారాలు, కోర్టుకెక్కిన సర్పంచ్‌లు: వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్.. జీవో నెం. 2 ఉపసంహరణ
సంస్థాగత ప్రసవాలు జరిగాయని... తల్లులు మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నారని... పిల్లలు సాధారణ జనన బరువుతో జన్మించినట్లు గిరిజన సంక్షేమ శాఖ నివేదిక వెల్లడించింది. చాలా కాలం క్రితం వేసిన మంచినీటి గొట్టాలు తుప్పుపట్టి తాగునీరు కలుషితం కావడంతో పాటు, తల్లుల్లో కాల్షియం లోపమే ఈ శిశు మరణాలకు కారణమని సమగ్ర విచారణలో తేలింది.
గవర్నర్ స్పందించడంతో గిరిజన సంక్షేమ శాఖలో కదలిక వచ్చింది. వెంటనే గ్రామంలో తాగునీటి పైప్‌లైన్‌ను మార్చటంతో పాటు, అత్యవసర వైద్య సేవ కోసం రెండవ అంబులెన్స్ అందించే ఏర్పాటు చేసింది. అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు విశాఖపట్నం కెజిహెచ్ నుండి ఒక మల్టీ స్పెషలిస్ట్ వైద్య బృందం గ్రామాన్ని సందర్శించింది. స్థానికులతో సంభాషించి, నీరు, మట్టి తదితర నమూనాలను పరిశీలించారు. నవజాత శిశువుల పెంపకంలో అవగాహనా లేమి, చిన్నారుల శ్వాసకోశ వైఫల్యం కూడా శిశు మరణాలకు కారణమని వైద్యులు కనుగొన్నారు. దీంతో గ్రామంలో తక్షణ సేవల కోసం స్టాప్ నర్పును నియమించారు.
ముంచేంగిపుట్టులో ప్రసవాల కోసం వేచిఉండే కేంద్రంలో బాలింతలతో పాటు పాలిచ్చే తల్లులు బస చేసేందుకు, గర్భిణులకు, బాలింతలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. స్ధానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంకు తాగునీటి పైపులైన్‌ను ఏర్పాటు చేసారు. ఏజెన్సీ ప్రాంతంలో సరైన కమ్యూనికేషన్ సౌకర్యాల ఏర్పాటు, రుద్రకోట, పాతరూడకోట గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణం, నివాస గృహాల నిర్మాణం వంటి దీర్ఘకాలిక చర్యలను కూడా తీసుకోవాలని షెడ్యూల్డ్ కులాల, గిరిజన ప్రాంతాల పాలనాధికారి హోదాలో గవర్నర్ హరిచందన్ ఆదేశాలు జారీ చేసారు.
read more రాజకీయాల్లో సమూల మార్పులకు ప్రయత్నిద్దాం: దళిత, బీసీ, కాపులకు ముద్రగడ లేఖ
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది 24 గంటలు గ్రామంలో అందుబాటులో ఉండాలని, భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో శిశు మరణాలు సంభవించ కుండా అన్ని చర్యలు తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేసారు. ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియాను అదేశించారు.
