విజయవాడ: రాష్ట్రంలో కోవిడ్19 స్థితిగతులపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్నీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 కోవిడ్ -19 కేంద్రాలుగా నియమించబడిన ఆసుపత్రులలో పడకల లభ్యతపై డేటాను ఆన్‌లైన్ సమాచార వ్యవస్థ ద్వారా అవసరమైన వ్యక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని  అధికారులకు గవర్నర్ సూచించారు. కోవిడ్ -19 రోగి చికిత్సలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మరియు ఇతర అధికారుల  కృషిని గవర్నర్ ప్రశంసించారు.

అన్‌లాక్ తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుండి 13 శాతం వరకు పెరగడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మొదటి ఐదు జిల్లాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన గవర్నర్,  ఈ ఐదు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా  నివారించడానికి  తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మొబైల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని హరిచందన్ ప్రశంసించారు. 

read more   గవర్నర్‌తో కేసీఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

అన్‌లాక్ ప్రకటించిన తరువాత పొరుగు రాష్ట్రాల నుండి ప్రజలు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ సంఖ్యలో తరలిరావడమే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడానికి కారణం అని... జూలై చివరి నాటికి ఇది తగ్గుతుందని భావిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ గవర్నర్ కు వివరించారు. పాజిటివ్  కేసుల పెరుగుదలకు అనుగుణంగా తగిన సంఖ్యలో పడకలు అందుబాటులో ఉన్నాయని సీఎస్ అన్నారు. 

పాజిటివ్ కేసుల సంఖ్యను 5 శాతానికి తగ్గించడానికి,  మరణాల సంఖ్యను 1 శాతం కంటే తక్కువగా  ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి  కె.ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. టెస్టింగ్,  ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్ మరియు ట్రీట్మెంట్ పద్ధతిని అనుసరించి వైరస్  ఉదృతిని తగ్గించడానికి  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. 24 గంటల్లో ఫలితం లభించేలా కరోనా పరీక్ష లేబరేటరీల పనితీరును క్రమబద్ధీకరిస్తున్నామని జవహర్ రెడ్డి తెలిపారు. 

ప్రజలు 104 కాల్ సెంటర్‌కు కాల్ చేసి పరీక్ష చేయించుకోవచ్చని... కాల్ సెంటర్ ద్వారా  కోవిడ్ -19 పాజిటివ్ రోగులు ఆసుపత్రులలో అడ్మిషన్ కూడా పొందవచ్చని  జవహర్ రెడ్డి  అన్నారు. 15-20 నిమిషాల్లో ఫలితాన్ని ఇవ్వగల 3.25 లక్షల రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని... పరీక్షలను కూడా రోజుకు 35000-40000 వరకు పెంచడానికి కృషి చేస్తున్నామని  ఆయన అన్నారు. 

బహిరంగ ప్రదేశాలలో పేస్ మాస్క్ ధరించడం ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసిందని జవహర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక కోవిడ్ -19 రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వం 2700 మంది వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు.

గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కె. భాస్కర్,ఇతర ప్రభుత్వ  అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.