విజయవాడ: ప్రాంతీయ సమానతల కోసం మూడు రాజధానులు అవసరమని  ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని  మంగళవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన  కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  కరోనా విపత్తును రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందన్నారు. ఏపీలో శాంతి భద్రతల విఘాతానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  అభిప్రాయపడ్డారు.

కరోనా సమయంలో ప్రజలకు వైద్య సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.అన్నివర్గాలకు నవరత్నాల పథకం అమలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు.రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం స్పష్టమైన ఎజెండాతో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

పేద, బడుగు, బలహీనవర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  భిన్నత్వంలో ఏకత్వం తమ సిద్దాంతమన్నారు. కొందరు ప్రజల మధ్య శాంతిని చెడగొట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కుట్రలను అడ్డుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన వివరించారు.