తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా దుర్గాప్రసాద్ ఎంతో కృషి చేశారని గవర్నర్ తెలిపారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు గవర్నర్ .

అంతకుముందు ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణంపై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాతో దుర్గాప్రసాద్ మరణించినట్లు తెలుసుకున్న సీఎం వెంటనే ఆయన కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించి, ఓదార్చారు.

Also Read:బ్రేకింగ్: కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూత

1985లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు  నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ విద్యా శాఖ మంత్రిగా పలు సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన వివాదారహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన తిరుపతి ఎంపీగా గెలుపొందారు. నాటి నుంచి వైసీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.