కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకట సుబ్బయ్య తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుండి ఆర్థోపెడిక్స్ లో ఎంఎస్ చేసి డాక్టర్‌గా సేవలందించారని గవర్నర్ గుర్తుచేశారు.

2019లో బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించడం తనను కలచివేసిందని గవర్నర్ చెప్పారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు తన హృదయ పూర్వక సంతాపాన్ని తెలిపారు.

మరోవైపు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమదుగు రహదారిపై ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంపైనా గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఆలయం నుంచి తిరిగి వస్తున్న ఎనిమిది మంది యాత్రికులు మరణించగా మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

యాత్రికులు తమిళనాడుకు చెందినవారని .. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు గవర్నర్‌‌కు అధికారులు సమాచారం ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపాన్ని తెలిపారు.