ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: పెండింగ్ డీఏ విడుదలకు ఉత్తర్వులు
పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏను చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారంనాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి పెంచిన డీఏతో కలిపి వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి నుండి ఈ ఏడాది జూన్ వరకు డీఏ బకాయిలను మూడు విడుతల్లో చెల్లించనుంది ప్రభుత్వం. పెంచిన డీఏతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 22.75 శాతానికి చేరనుంది. పెంచిన డీఏ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా వర్తించనున్నాయి.
ఈ ఏడాది జనవరి మాసంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు సీఎం జగన్ ను కలిశారు. పెండింగ్ లో ఉన్న రెండు డీఏలతో పాటు బకాయిలను విడుదల చేయాలని సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎం జగన్ కు అందించారు.
పంక్రాంతిని పురస్కరించుకొని ఒక డీఏను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలను కూడా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.