Asianet News TeluguAsianet News Telugu

గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోపు చెప్పండి.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి(ఏపీజీఈఏ) రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.

AP Government Notices to Andhra Pradesh Government Employees Association
Author
First Published Jan 23, 2023, 2:04 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి(ఏపీజీఈఏ) రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగ సంఘం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్దమని తెలిపింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నా గవర్నర్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించింది. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. జీతాలు, పెన్షనల చెల్లింపులో జాప్యం  కారణంగా ఉద్యోగులు పడుతున్న ఆర్థిక బాధలను ఆయనకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. 

గవర్నర్‌తో భేటీ అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంలో విఫలమైందన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి వారి అనుమతి లేకుండా డబ్బును విత్‌డ్రా చేస్తోందని ఆరోపించారు. ఈ  నేపథ్యంలోనే 95 శాతం ఉద్యోగులకు ప్రతి నెలా 5వ తేదీలోపే జీతాలు చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 నుంచి 95 శాతం మందికి 5వ తేదీలోపే జీతాలను అందిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను మానవ వనరులుగా భావిస్తున్నామని.. వారే తమకు పెద్ద ఆస్తి అని పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్యలు, కోవిడ్ సంక్షోభం ఉన్నా జీతాలు, పెన్షన్లు ఆపలేదని తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ఇందులో పొందుపరిచారు. 

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కోవిడ్ పరిస్థితుల వల్ల ఆర్థికంగా అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి నెలా 5 తేదీన 90 నుంచి 95 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం చెల్లిస్తున్నట్టుగా వెల్లడించారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లలు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టుగా పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులకు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వగలం అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios