అమరావతి: ఈ ఏడాది ఆగష్టు 3వ తేదీ నుండి స్కూల్స్ ఓపెన్ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై సీఎం జగన్ మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ స్కూళ్లలో నాడు- నేడు కార్యక్రమం గురించి కూడ ఆయన సమీక్షించారు. జూలై నెలాఖరుకు మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు- నేడు కింద అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

also read:విదేశాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్: జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతి

ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో తొమ్మిది రకాల సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఇప్పటికే రూ.456 కోట్లను విడుదల చేసినట్టుగా ఆయన చెప్పారు. జూలై నెలాఖరు నాటికి అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. 

అయితే స్కూళ్లలో పనులు పూర్తి కావడానికి ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లు స్కూళ్లలో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆయన సూచించారు.స్కూళ్లలో నిర్మాణ పనులకు అవసరమైన మెటిరియల్, సిమెంట్, ఇటుకల కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉంటే వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ స్కూల్ విద్యావిధానాన్ని ప్రారంభించాలని కూడ సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.