ట్రైబల్ యూనివర్శిటీతో గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్తు: జగన్
గిరిజన యూనివర్శిటీతో గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభా పాటవాలను వెలికి తీసే అవకాశం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. సాలూరులో గిరిజన యూనివర్శిటీని ఇవాళ ప్రారంభించారు.
సాలూరు: గిరిజన యూనివర్శిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు నెలకొనే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, సీఎం జగన్ గురువారంనాడు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
గిరిజన యూనివర్శిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది రెండో సెంట్రల్ యూనివర్శిటీ అని ఆయన గుర్తు చేశారు.ఆర్ధికంగా, సామాజికంగా గిరిజనులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చెప్పారు.గిరిజనులకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.దోపీడీ నుండి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశామని సీఎం జగన్ వివరించారు.పాడేరులో మెడికల్ కాలేజీ కూడ ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు.కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ రానుందన్నారు.ఎనిమిదో తరగతి నుండే విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తున్నామని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినట్టుగా సీఎం చెప్పారు.గిరిజనులకు ప్రత్యేక జిల్లా, వర్శిటీని ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.గిరిజనులకు ఏకంగా రెండు జిల్లాలను ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.గిరిజన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ప్రతి పథకం గిరిజనులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
also read:సాలూరులో గిరిజన యూనివర్శిటీ: శంకుస్థాపన చేసిన జగన్, ధర్మేంద్ర ప్రధాన్
గిరిజనులకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లో వాలంటీర్లంతా గిరిజనులేనన్నారు. రాజకీయ పదవుల్లోనూ గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ అంకెలతో సహా వివరించారు.
అంతకు ముందు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసగించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ చెప్పారు. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి తెలిపారు. పార్టీలను పక్కన పెట్టి అభివృద్ధి గురించి కలిసి పనిచేస్తున్నామన్నారు.ఏపీ సర్కార్ ఇంగ్లీస్ కు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు.