Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం..

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని రోడ్లపై సభలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

Ap Government Bans Public Meetings and Rallies on Roads
Author
First Published Jan 3, 2023, 8:56 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని రోడ్లపై సభలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్టుగా తెలిపింది. ప్రజలకు ఇబ్బందులు  లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రాజ్ రహదారులను ప్రజలు, సరుకుల రవాణాకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం సూచించింది. రోడ్లకు దూరంగా, జనాలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రాంతాల్లో సభలకు స్థలాలు ఎంపిక చేయాలని.. పార్టీలు, సంస్థలు సభలను ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించుకోవచ్చని తెలిపింది.

అయితే అత్యంత అరుదైన సమయాల్లో ఎస్పీలు లేదా సీపీలు కచ్చితమైన షరతులతో అనుమతులు ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు ముందుగా నిర్వాహకులు లిఖితపూర్వకంగా అనుమతి  తీసుకోవాలని పేర్కొంది. సభను ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు అనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే రూట్‌ మ్యాప్, సభకు వచ్చే జనాల సంఖ్య, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను కూడా నిర్వాహకులు వివరించాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios