అమరావతి: ఏపీ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ మంగళవారం నాడు నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉమ్మడి హైకోర్టులో పలు కేసులను వాదించి విజయం సాధించిన ట్రాక్ రికార్డు సుబ్రమణ్య శ్రీరామ్‌కు ఉంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం చేసిన తర్వాత  తన టీమ్‌ను  నియమించుకొంటున్నారు. ఇందులో భాగంగానే  అడ్వకేట్ జనరల్‌గా సుబ్రమణ్య శ్రీరామ్‌ను నియమించారు.

1969 జూలై 5వ తేదీన పుట్టిన శ్రీరామ్  ఔరంగబాద్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ లా యూనివర్శిటీలో లా పూర్తి చేశాడు. 1992 ఆగష్టు మాసంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు.

సీవీ రాములు వద్ద శ్రీరామ్ తన న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. సీవీ రాములు జడ్జిగా నియామకం కావడంతో 1996లో శ్రీరామ్ స్వంతంగానే ప్రాక్టీస్ ప్రారంభించాడు.

రాజ్యాంగం, విద్య, సర్వీస్ కేసులను వాదించడంలో శ్రీరామ్‌కు మంచి పేరుంది. 2009 నుండి 2011 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ డీవీ సీతారామమూర్తి కార్యాలయంలో ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్‌గా శ్రీరామ్ సుబ్రమణ్యం పనిచేశారు.