Asianet News TeluguAsianet News Telugu

పెథాయ్ తుఫాన్: సముద్రంలో అల్లకల్లోలం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. పెథాయ్ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  ఈ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నె 17 సాయంత్రం పెథాయ్‌ తీరం దాటనుంది. 
 

ap government alerts people due tp pethai cyclone
Author
Amaravathi, First Published Dec 15, 2018, 5:02 PM IST

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. పెథాయ్ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  ఈ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నె 17 సాయంత్రం పెథాయ్‌ తీరం దాటనుంది. 

తుఫాన్ ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల ఉద్ధృతి పెరిగే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

పెథాయ్‌ తుఫాను నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్నిచోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

అలాగే 17న కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. శనివారం నుంచే కోస్తా తీరంలో గాలుల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు. గంటకు 80 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇకపోతే పెథాయ్‌ తుఫాన్ పరిస్థితులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యంత్రాంగం స‌ర్వస‌న్నద్ధంగా ఉందని అధికారులు చంద్రబాబుకు స్పష్టం చేశారు. 

జిల్లాల్లో తుఫాను ముంద‌స్తు స‌న్నద్ధత‌ల‌పై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప‌రిస్థితి ఎదుర్కోవ‌డానికైనా సిద్ధంగా ఉండాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రాణ‌న‌ష్టం లేకుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యంత్రాంగంతో నిత్యం ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

అటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది అధికార యంత్రాంగం. అన్ని టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. వెళ్లిన వారు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అలాగే తుఫాన్ ప్రభావిత జిల్లాలో ముందుగా కిచెన్స్ లను  కూడా ఏర్పాటు చేశారు. తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపితే ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆహారం, మౌళిక సదుపాయాల కల్పించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. 

ఆదివారం మధ్యాహ్నానికి తుఫాను తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విజయనగరం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 17 సాయంత్రం ఒంగోలు - కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం
 ఉందని గంటకు 90 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

పంట చేతికొచ్చే సమయం కావడంతో ధాన్యం కోనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్ళు వేగవంతం చేసినట్లు తెలిపారు. అలాగే 

హెల్ప్ లైన్  నెంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
విజయనగరం కలెక్టర్ రేట్ కార్యాలయంలో 08922276713,  ఆర్డీవో కార్యాలయం, విజయనగరం 
08922 276888 పార్వతీపురం, సబ్ కలెక్టర్ కార్యాలంలో 

089632207207 హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంతోపాటు కోనసీమలోని అన్ని తహశీల్తార్ కార్యాలయల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోనసీమలో 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం నెం.08856233208

మూడు నెలల్లో మూడు తుఫాన్ లు రావడంతో ఆంధ్రప్రజలు వణుకుపోతున్నారు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే తిత్లీ తుఫాన్ చేసిన నష్టాన్ని మరచిపోకముందే మరో తుఫాన్ రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios