పవన్‌ కళ్యాణ్ దారెటు, అవగాహాన లేకనే ఆ వ్యాఖ్యలు: యనమల

Ap finance minister Yanamala Ramakrishnudu comments on Pawan kalyan
Highlights

పవన్ కళ్యాణ్‌పై ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ దారెటో ముందు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.అవగాహాన లేకనే పవన్ కళ్యాణ్ టీడీపీపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు


అమరావతి: తన ప్రచారం వల్లే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  వ్యాఖ్యానించడం ఆయన అవగాహనలేమికి నిదర్శనమని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు  అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఆయన అమరావతిలో  మీడియాతో మాట్లాడారు. ఓ వైపు బీజేపీతో అంటకాగుతూ.. మరో వైపు లెఫ్ట్‌ పార్టీలతో సమావేశాలు నిర్వహించడం ఏం సూచిస్తోందని ఆయన ప్రశ్నించారు.  టీడీపీపై పవన్ కళ్యాణ్  చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. 

ఉత్తరాంధ్ర ఉద్యమం అంటూ యువతను  పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. తన వల్లే ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ప్రజలు  నమ్మడం లేదన్నారు. అంతేకాదు ప్రజలు నమ్మడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. 

పవన్‌కళ్యాణ్ బీజేపీతో ఉంటారో, లెఫ్ట్ పార్టీలతో ఉంటారో  ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వంపై  ఒక్క విమర్శ కూడ చేయని పవన్ కళ్యాణ్ టీడీపీపై ఎందుకు ఒంటికాలిపై  విమర్శలు చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం నమ్మక ద్రోహానికి పరాకాష్టగా ఆయన  విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పెత్తనం సాగించాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు.

loader