చంద్రబాబునాయుడు మా మిత్రుడే అంటూ కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తోందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

న్యూఢిల్లీ: చంద్రబాబునాయుడు మా మిత్రుడే అంటూ కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తోందని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు.

పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనపై శుక్రవారం నాడు యనమల రామకృష్ణుడు ఓ మీడియా ఛానెల్‌తో స్పందించారు. ప్రత్యేక హోదా అనేది కేంద్రం అనుకొంటే ఇవ్వవచ్చన్నారు. 

ప్రజల ఎన్నుకొన్న ప్రభుత్వం ఏం చేయాలనుకొంటే అది చేసే వెసులుబాటు ఉందన్నారు. కానీ, ఈ విషయమై కేంద్రం సానుకూలంగా లేదనేది పార్లమెంట్‌ వేదికగా స్పష్టమైందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అనేది కేంద్రం ఇవ్వాలనుకొంటే ఇవ్వొచ్చన్నారు. 

ఏపీకి రెవిన్యూలోటు కింద రూ.4117 కోట్లు ఇచ్చినట్టు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారని చెప్పారు. అయితే సీఏజీ నివేదిక ప్రకారంగా సుమారు రూ16వేల కోట్లు రెవిన్యూ లోటు ఉన్న విషయాన్ని తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరు పట్టించుకోలేదన్నారు. 

ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడ చెప్పలేదని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు.చంద్రబాబునాయుడు మా మిత్రుడే అని పార్లమెంట్ వేదికగా చెప్పి రాజ్‌నాథ్ సింగ్ తప్పించుకొనే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

నాలుగేళ్లుగా ఏపీకి నిధులు ఇవ్వకుండా.. ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ఉన్న కారణంగానే తాము కేంద్రం నుండి , ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టుగా యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. రాజకీయంగా పరిచయాలు వేరు.. రాష్ట్రానికి నిధులు ఇవ్వడం వేరని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.