Asianet News TeluguAsianet News Telugu

చేనేత రంగాన్ని ఆదుకోవాలి.. టెక్స్‌టైల్ పరిశ్రమపై జీఎస్టీని వద్దన్నాం : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

చేనేత వస్త్రాలపై (textile industry) 12 శాతం జీఎస్టీ పన్ను (gst)ప్రతిపాదనపై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

ap finance minister buggana rajendranath reddy comments after gst council meeting
Author
New Delhi, First Published Dec 31, 2021, 7:44 PM IST

చేనేత వస్త్రాలపై (textile industry) 12 శాతం జీఎస్టీ పన్ను (gst)ప్రతిపాదనపై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు వ్యతిరేకించారు. దీంతో కేంద్రం వెనక్కు తగ్గక తప్పలేదు. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy ) మీడియాతో మాట్లాడారు. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని బుగ్గన అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి  వివరాలు లేకుండా  నిర్ణయం తీసుకోలేమని మంత్రి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ys jagan) కోరారని పేర్కొన్నారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 

Also Read:వస్త్ర పరిశ్రమకు ఊరట: జీఎస్టీ పన్ను పెంపు అమలు వాయిదా

పోలవరంపై (polavaram) సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని, ప్రీ బడ్జెట్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేశామని బుగ్గన పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం వల్ల పోలవరం ఖర్చు పెరిగిందని, వచ్చే బడ్జెట్‌లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ (kadapa steel plant), పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు బుగ్గన వివరించారు. 

వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని, నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే  ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినట్టు రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామని మంత్రి అన్నారు. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios