విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. వైయస్ జగన్ కు పాలన చేతకాదని నిప్పులు చెరిగారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా మహేశ్వరరావు జగన్ అమెరికాలో ఉండి ప్రజలను వరదల్లో ముంచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం జగన్ అసమర్థ పాలన, చేతగానితనం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్లేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.  రాజధాని విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో ఏముందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.  

 

సీఆర్డీయే పరిధిలో ఒక కులానికి చెందిన వ్యక్తులు లబ్ధిపొందారని కేంద్రానికి జగన్ రాసిన లేఖను దమ్ముంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. జగన్మోహన్‌రెడ్డి అమరావతిని భ్రమరావతి అన్నారు, అమరావతిలో 33వేల ఎకరాలకు సంబంధించి రైతుల త్యాగాలున్నాయి, అమరావతిలో ఇటుక పెట్టలేదని చెప్పి అదే అమరావతి నుండి పాలన అందిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టు కొట్టేయాలని చూసి అది కుదరకపోవడంతో పోలవరం పనుల్ని, బందర్ పోర్టును రద్దు చేశారని మండిపడ్డారు. 

రాజన్నరాజ్యంలో అంతా కాన్ఫిడెన్సియల్ ఎందుకో అంటూ ప్రశ్నించారు. రాజధాని మార్పుపై సీఎం జగన్ అమెరికా నుండి వెంటనే ట్వీట్ ద్వారా స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

అమరావతి రాజధానికి  రైతులు 33వేల ఎకరాలిస్తే వారందరినీ మోసం చేశారని మండిపడ్డారు. 

అన్నా క్యాంటీన్ల మూసివేయడం దారుణమన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతతో పేదలు అల్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కృష్ణపట్నం పోర్టు వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్మాణాలు చేపట్టారని ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తోందన్నారు. 

హైదరాబాద్ మహానగరం లక్ష 25వేల కోట్ల ఆదాయం సమకూరుస్తోందని తెలిపారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్నో  ఐటీ కంపెనీలను, పారిశ్రామికవేత్తలను ప్రమోట్ చేశారని ఆయన దూరదృష్టి, విజన్, తెలంగాణలో స్పష్టంగా కనబడుతుందన్నారు. హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచిందంటే అందుకు కారణం   చంద్రబాబేనని చెప్పుకొచ్చారు.

కృష్ణావరదల బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 

ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలవల్ల ఏపీకి వరదలు వస్తే సీఎం జగన్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 

అమెరికాలో ఉన్న జగన్ కనీసం వదరలపై ఒక్క సమీక్ష కూడా చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారని విమర్శించారు. పంట పొలాలు మునిగిపోవటంతో రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు. 

రాజధాని అమరావతిని, చంద్రబాబు ఇంటిని ముంచడానికి కుట్ర చేస్తున్నారని తాను ముందే హెచ్చరించానని చెప్పుకొచ్చారు. తాను చెప్పిందే ఇప్పుడు వాస్తవమైందన్నారు. రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పుకొచ్చారు.  

మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లంతా చెమటలు పట్టేలా రాజధాని మునిగిపోయిందని మాట్లాడుతున్నాడని విమర్శించారు. 

ఏపి రాజధాని అమరావతి ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని ఆనాడు అమరావతి రాజధానిని నిర్మాణాన్ని జగన్ ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపారని గుర్తు చేశారు. 

సీఎం జగన్మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తూ తమ నేతలకు ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని చెప్పారా లేదా అని ప్రశ్నించారు. మీకు సీట్లు ఇవ్వలేకపోయా, అక్కడ భూములు కొనండి, లాభం జరుగుతుందని చెప్పింది వాస్తవం కాదా? మీరు రాజధాని మార్చటానికి కేంద్రం అనుమతి తీసుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.  

అమ్మ, అక్క, అయ్యా అని అడుక్కుని ఇప్పుడు అందరినీ ముంచుతారా అంటూ నిలదీశారు. అమెరికా పర్యటన స్వప్రయోజనాలకే తప్ప రాష్ట్రప్రయోజనాల కోసం కాదని ధ్వజమెత్తారు.  మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపైనా నిప్పులు చెరిగారు. 

విజయసాయిరెడ్డి ట్విట్టర్ పులి అంటూ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి నువ్వు ట్వీట్ లు చేసుకో అంటూ విమర్శించారు. విజయసాయిరెడ్డి ట్వీట్ లు చూస్తుంటే ఒక జోకర్ లా పెట్టే ట్వీట్ లు గుర్తుకు వస్తున్నాయంటూ సెటైర్లు వేశారు దేవినేని ఉమామహేశ్వరరావు.