అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. వైయస్ జగన్ ప్రభుత్వం తనకు భద్రత కుదించిందని కుదించిన భద్రతను పునరుద్ధరించేలా చూడాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీ, గుంటూరు అర్బన్ పోలీస్ ను పిటీషన్ లో పొందు పరిచారు చంద్రబాబు. చంద్రబాబు పిటీషన్ ను విచారణకు స్వీకరించింది హై కోర్టు.  చంద్రబాబు పిటీషన్ పై హైకోర్టు మంగళవారం విచారించనుంది. 

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా చంద్రబాబుకు భద్రతను తగ్గించిందని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం ఇటీవలే భద్రత కుదించింది.  

చంద్రబాబు వాహనశ్రేణిలో ఎస్కార్ట్‌, పైలట్‌ వాహనాలను పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం ఆయనకు జడ్‌ప్లస్‌ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర పోలీసుల తరఫున ఉన్న భద్రతను కుదించారు. గతంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు భద్రత కల్పించేవారు. ప్రస్తుతం అందరినీ తొలగించి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున 3 బృందాలను కేటాయించింది ఏపీ సర్కార్. 

ఈ నేపథ్యంలో 2014కు ముందు మాజీ సీఎం హోదాలో ఉన్న భద్రతను కల్పించాల్సిందిగా చంద్రబాబు హైకోర్టును కోరినట్లు తెలుస్తోంది. భద్రతా సమీక్ష జరిపిన తర్వాతే చంద్రబాబు భద్రతపై నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ అలాంటిదేమీ జరగకుండా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భద్రతను కుదించారని టీడీపీ ఆరోపిస్తోంది. 

 చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నట్లు తెలిపారు. తాము నిబంధనల ప్రకారం ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు భద్రత కుదించారన్న ప్రచారం అసత్యమంటూ ప్రభుత్వం కూడా వాదిస్తోంది. అయితే ఈ వ్యవహారం కాస్త కోర్టుమెట్లెక్కడంతో వివాదం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి మరి.