క‌రోనాతో తిరుమ‌ల‌, దుర్గ‌గుడి అర్చ‌కుల మృతికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు. అర్చకుల కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

కేంద్ర‌, రాఫ్ట్రాల నిభంద‌న‌ల‌ను అనుస‌రించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గ‌దర్శ‌కాల‌ ప్ర‌కారం ఆలయాల్లో శానిటైజ్ చేయించిన తర్వాతే భక్తులను అనుమతిస్తామని వెల్లంపల్లి చెప్పారు.

ప్రతి భక్తుడు వీఐపీనే అన్న ఆయన... వారికి మెరుగైన సేవలు అందించేందకు కృషి చేస్తామని వెల్లడించారు. కరోనా నివారణకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో యధావిధిగా యజ్ఞాలు, హోమాలు, నిత్య పూజలు, కైంకర్యాలు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

Also Read:విజయవాడ దుర్గగుడి ఈవో సహా మరో 18 మందికి కరోనా

65 ఏళ్లకు పైబడిన వారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు  ఆలయాలకు రాక‌పోవ‌డం మంచిదని వెల్లంపల్లి సూచించారు. ఇందుకు అనుగుణంగా భక్తులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

భక్తులు దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నపుడు కనీసం ఆరడుగుల సామాజిక‌ దూరం తప్పకుండా పాటించాల‌ని మంత్రి సూచించారు. ఇందుకోసం  అన్ని ఆల‌యాల్లో మార్కింగ్స్ వేశామని... అలాగే ఫేస్ కవర్స్, మాస్కులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించాలని తెలియజేశారు.

భ‌క్తులు ఎలాంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని శ్రీనివాస్ తెలిపారు. భక్తులందరూ ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని.. ఆలయాల్లో దేవతా మూర్తులను, పవిత్ర గ్రంథాలను తాకరాదని మంత్రి సూచించారు.