స్ధానిక ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి, వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. కరోనా ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర అధికారుల సూచనల మేరకే ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారమే ఎన్నికలు వాయిదా వేశామని, కరోనాపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిందని, కరోనాను జాతీయ విపత్తుగా భారత ప్రభుత్వం ప్రకటించిందని రమేశ్ తెలిపారు.

Also Read:ఈసీ రమేశ్ కుమార్‌ను వదిలేది లేదు.. ఎంత దూరమైనా వెళ్తాం: జగన్ హెచ్చరిక

జాతీయ స్థాయి సంస్థలను సంప్రదించాకే వాయిదా నిర్ణయం తీసుకున్నామని, కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలుపెడతామని, ఆరు వారాల్లోపే మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రమేశ్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారమే పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో హింసకు సంబంధించి ఇప్పటికే పలు పార్టీలు ఫిర్యాదు చేశాయన్నారు.

 హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని చూడాలని నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికల సంఘానికి ఉద్దేశ్యాలను ఆపాదించడం దురదృష్టకరమని, ఇది ఎన్నికల సంఘాన్ని బలహీనపరడచమేనని రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈసీ రమేశ్ కుమార్‌ కుమార్ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయనలో గనుక మార్పు రాకుంటే ఎంత దూరమైనా వెళ్తామన్నారు  స్ధానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తోందని, 9 వేలకు పైగా వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవమయ్యారని ఈ వార్త వారికి దుర్వార్త అయ్యిందంటూ ప్రతిపక్షాలకు జగన్ మండిపడ్డారు.

Also Read:అదే సామాజిక వర్గం, రమేష్ కుమార్ వెనక చంద్రబాబు: జగన్

దీనిని జీర్ణించుకోలేక చంద్రబాబు మరింత పడిపోతారనే ఎన్నికలు వాయిదా వేశారని సీఎం ఆరోపించారు. కరోనా వైరస్ కారణంతో ఎన్నికలను వాయిదా వేసే పరిస్ధితి ఉన్నప్పుడు కనీసం ఎవరో ఒకరి సూచనలు, సలహాలు తీసుకోవాలి కదా అని జగన్ ప్రశ్నించారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శితో కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కానీ సమీక్షా సమావేశం కూడా నిర్వహించాల్సిన పని లేదా ముఖ్యమంత్రి నిలదీశారు. రాష్ట్రంలో హెల్త్ సెక్రటరీ కంటే సీనియర్ ఎవరైనా ఉంటారా అని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడే ఆయనను పదవిలో పెట్టి ఉండొచ్చునని, ఇద్దరి సామాజిక వర్గాలు ఒకటే అయినంత మాత్రాన ఇంత వివిక్ష చూపడం ధర్మామేనా అని జగన్ నిలదీశారు