అనంతపురం: రాష్ట్రంలో కోవిడ్ సంఖ్య గణనీయంగా తగ్గడం సంతోషదాయకమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రదానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 10వేలకు పైగా కేసులు నమోదయిన పరిస్థితుల నుండి తాజాగా 150, 200 కేసులకు తగ్గడం శుభపరిణామమని అన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టింది కాబట్టి ఓటర్లు భయపడకుండా పోలింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎస్ఈసీ పిలుపునిచ్చారు. 

పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇవాళ నిమ్మగడ్డ అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే నిధులు, విధులు వస్తాయన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమయం పెంచామన్నారు. కోవిడ్ పేషేంట్లకు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని...వారికి పీపీఏ కిట్లు అందించి పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తామన్నారు. 

''రాష్ట్ర వ్యాప్తంగా జాగ్రత్తలు తీసుకున్నాం. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది తో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర ఉద్యోగుల, సిబ్బంది పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కేంద్ర సిబ్బంది అన్నది ఆప్షన్ మాత్రమే. అనంతపురంకు పెద్ద బార్డర్ ఉండటంతో లిక్కర్ సమస్య గా మారింది. నివారణ చర్యలు చక్కగా ఉన్నాయి'' అంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీని ఎస్ఈసీ అభినందించారు. 

read more శరీరమే నిమ్మగడ్డది, చంద్రముఖిలా చంద్రబాబు ప్రవేశించి లకలక: విజయసాయి

''నిన్న(గురువారం) గవర్నర్ ను కలిసి పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై అనేక పార్టీలు ఫిర్యాదు చేశాయి. తమ అనుమతి లేకుండానే ప్రభుత్వం ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై సంబంధిత ఐ అండ్ పిఆర్ అధికారులను సంజాయిషీ కోరాను.. అది నా విధి. నా పని. ఇంత శాతం ఏకగ్రీవాలు కావాలి అన్నదానికి నేను వ్యతిరేకం'' అని స్పష్టం చేశారు.

''కొత్తగా అలజడి సృష్టిస్తే షాడో టీమ్ లు నిఘా పెంచమని చెప్పాం. అవసరం అయితే చర్యలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ భాగం. ఓటు వేయడం అందరి హక్కు. పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు జిల్లా అధికారులు తీసుకుంటారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి'' అని పేర్కొన్నారు.

''కొత్త యాప్ తెచ్చాం. ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం. ఫిర్యాదు లు అందులో స్వీకరిస్తారు. యాప్, కాల్ సెంటర్, డాష్ బోర్డు, మీడియా ద్వారా వచ్చే వాటిని పరిగణలోకి తీసుకుంటాం. మీడియాది ఎన్నికల్లో గొప్ప పాత్ర. నిర్మాణాత్మకంగా వ్యవహరించండి'' అని ఎస్ఈసీ నిమ్మగడ్డ సూచించారు.