ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది . దీనిలో భాగంగా సోమవారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256గా ఈసీ తెలిపింది.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది . దీనిలో భాగంగా సోమవారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్లు 5.8 లక్షల మంది పెరిగారని మీనా చెప్పారు. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర పెరిగారని ఆయన వెల్లడంచారు.
2023 ఆగస్టులో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారని మీనా తెలిపారు. ఈ సమయంలో తప్పుడు అడ్రస్‌తో పాటు చిరునామానే లేకుండా ఒకే ఇంట్లో పది మందికి మించి ఓటర్లు వుండటం వంటివి వారి దృష్టికి వచ్చాయని సీఈవో వెల్లడించారు. చిరునామా లేకుండా 2.51 లక్షల మంది , 10 మందికి పైగా ఓటర్లు వున్న 1.51 లక్షల ఇళ్లను గుర్తించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే చిరునామాతో 700 మందికి పైగా వున్నారని, ఈ సమస్యను 98 శాతం మేర సరిచేశామని మీనా చెప్పారు. 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇచ్చాయని, వాటిని పరిశీలించి 5.6 లక్షల ఓట్లను తొలగించామని ఆయన వెల్లడించారు.
కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా కొంరు ఫాం 6, ఫాం 7 నమోదు చేశారని .. అలాంటి వారిపై కేసులు నమోదు చేశామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. 80 ఏళ్ల వయసు పైబడిన వారు ఇళ్ల నుంచే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వారు రాష్ట్రంలో 4.70 లక్షల మంది వుంటారని ఆయన వెల్లడించారు. ఓటరు తుది జాబితాను రాష్ట్రంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో వుంచుతామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256గా ఈసీ తెలిపింది. వీరిలో మహిళా ఓటర్లు 2,07,37,065 కాగా.. పురుషుల సంఖ్య 2,00,09,275 మంది. సర్వీస్ ఓటర్లు 67,434.. థర్డ్ జెండర్ ఓటర్లు 3482.
