ఏపీలో ఎన్నికల నగారా మోగింది, ఖాళీగా వున్న సర్పంచ్, వార్డ్ మెంబర్ల భర్తీకి ఎన్నికలు నిర్వహణకు సిద్దమయ్యింది ఎలక్షన్ కమీషన్.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా వున్న గ్రామ పంచాయితీ పాలకవర్గాల నియామకానికి ఈసి సిద్దమయ్యింది. ఈ మేరకు వివిధ కారణాలతో ఖాళీగా వున్న గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ పంచాయితీ ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీఫైనల్ లా భావించి ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.
రాష్ట్రంలోని 1033 గ్రామ పంచాయితీల్లో ఖాళీగా వున్న 66 సర్పంచ్ లు, 1063 వార్డు మెంబర్ల ఎన్నికలకు ఈసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల(ఆగస్ట్) 19న ఎన్నికలు, అదే రోజు మద్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు ఈసి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది.
గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసిపి అత్యధిక పంచాయితీల్లో విజయం సాధించింది. చివరకు టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఇలాకా కుప్పంలోనూ వైసిపి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే అధికార అండతో అవకతవకలకు పాల్పడి వైసిపి గెలిచిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
Read More రెండ్రోజులు పోలీసులు సెలవు పెట్టుకొండి... చంద్రబాబో, జగనో తేలిపోతుంది: వెంకన్న హాట్ కామెంట్స్
గతంలో కుప్పం నియోజకవర్గం పరిధిలోని 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 74 చోట్ల విజయం సాధించింది. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెసు మద్దతుదారు ఒక చోట గెలిచారు. కుప్పం మండలంలోని 26 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 21, టీడీపీ మద్దతుదారులు 5 చోట్ల విజయం సాధించారు. గుడుపల్లె మండలంలోని 18 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 13, టీడీపీ 4, కాంగ్రెసు మద్దతుదారులు 1 చోట విజయం సాధించారు. శాంతిపురం మండలంలోని 23 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ 20, టీడీపీ 3 పంచాయతీలు గెలుచుకున్నాయి. రామకుప్పం మండలం 22 పంచాయతీలకు గాను వైసీపీ 20 పంచాయతీల్లో, టీడీపీ మద్దతుదారులు 2 పంచాయతీల్లో విజయం సాధించారు.
ఇక ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్నా యి. దీంతో అధికార పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులతో ప్రజల్లోకి వెళితే ప్రతిపక్షాలు పాదయాత్రలు, బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. ఇలాంటి సమయంలో ఖాళీగా వున్న పంచాయితీల్లో సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా సాగనుంది.
