అమరావతి: రాగల 6 గంటల్లో నివర్‌ అతి తీవ్ర తుపానుగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. కడలూర్ కి తూర్పు ఆగ్నేయం 240 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు, చెన్నైకి  300 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతం అయ్యిందన్నారు. ఇది ఇప్పటికే ఊహించినట్లుగా ఇవాళ సాయంత్రం కాకుండా రేపు(గురువారం) తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం వుందని తెలిపింది. 

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్  బృందాలు సిద్దంగా వున్నట్లు తెలిపారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు  జిల్లాల అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. 

read more  దూసుకొస్తున్న నివర్ తుఫాను: ఏపీ దక్షిణ కోస్తాకు ముప్పు

నివర్ తుఫాను తీరందాటే సమయంలో 120-145కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం వుందని... కాబట్టి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో  వేటకు వెళ్లరాదని... తీర ప్రాంతంలో నివాసముండే ప్రజలు జాగ్రత్తగా వుండాలన్నారు. 

ఈ తుపాను తీరం దాటే సమయంతో తీవ్రమైన గాలులు వీయడం, భారీ వర్షాలు కురియడంతో పాటు  26,27తేదీల్లోనూ తమిళనాడులోని కడలూర్‌, విళ్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 25, 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకు హుటాహుటిన బయలుదేరాడు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,  నెల్లూరు నగర కమిషనర్ దినేష్ కుమార్ తదితరులతో మాట్లాడుతూ తుఫానును ఎదుర్కోడానికి చేపట్టిన చర్యలపై చర్చించి పలు సూచనలు అందించారు మంత్రి అనిల్.