విజయవాడ: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైనా వుందని రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిజిపి సూచించారు.

''ఇటీవల దేవాలయాలకు సంబంధించిన వరుస  సంఘటనల దృష్ట్యా  రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు  అప్రమత్తమయ్యాయి. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద  నిరంతరం నిఘా, పెట్రోలింగ్ మరియు విజిబుల్ పోలీసింగ్ కు  ఆదేశించడం జరిగింది. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని  పోలీసులకు లేదా డైల్ 100కు  సమాచారం ఇవ్వాలని... ఎల్లవేళలా పోలీసుశాఖ అందుబాటులో ఉంటుంది'' అని డి‌జి‌పి తెలిపారు.

''రాష్ట్రంలోని  అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రత చర్యలను పర్యవేక్షించాలని ఎస్పీలకు స్పష్ఠమైన  ఆదేశాలిచ్చాం. ప్రతి ఒక్క  దేవాలయాలన్ని జియో ట్యాగింగ్ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్దాం'' అన్నారు. 

read more  అందుకోసమే బజారు మనిషిలాగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబుపై హోంమంత్రి ఫైర్

''మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అంటూ డిజిపి హెచ్చరించారు.

''దేవాలయాలపై ఈ రకమైన సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా విజ్ఞప్తి, ఇది మనందరి బాధ్యత, మీ అందరి సహకారంతో మన సాంప్రదాయాలను గౌరవిస్తూ  దేవాలయాలను కాపాడుకుందాం'' అని సవాంగ్ సూచించారు.