టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఖరారైంది. ఆర్. వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్‌ అయిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతించారు.

దీని ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు వెళతారు. వెంకటాపురం గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

అనంతరం స్థానిక టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. సాయంత్రం రోడ్డు మార్గంలో అమరావతిలోని ఆయన నివాసానికి రానున్నారు. కాగా... లాక్ డౌన్ విధించినప్పటినుండి హైదరాబాద్ లోనే ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీకి వెళ్ళడానికి అధికారులను అనుమతులను కోరారు. 

Also Read:ఎట్టకేలకు ఏపీకి వెళ్లేందుకు అధికారుల అనుమతి కోరిన చంద్రబాబు, ఎందుకంటే...

25 వ తేదీ నుండి విమానాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి అనుమతుల నిమిత్తం ఒక లేఖ రాసారు. 25 వ తేదీన ఉదయం 10.35 విమానం ద్వారా హైదరాబాద్ నుండి విశాఖ చేరుకొని, అక్కడి నుండి ఉండవల్లి వెళ్ళడానికి అనుమతులను కోరారు. 

విశాఖలో దిగిన వెంటనే, అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించి, అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోవడానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.  

ఇకపోతే... ఎల్జీ పాలీమర్స్ లో స్టెరిన్ గ్యాస్ లీకైన ఘటనలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎల్జీ పాలీమర్స్ ఘటనపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించింది.

కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనతో కంపెనీ తరపు న్యాయవాది మాత్రం విబేధించారు. కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు సరెండర్ చేశామని హైకోర్టు కు కంపెనీ తరపు న్యాయవాది తెలిపారు.

Also Read:బాబు విశాఖ టూర్‌పై హోం మంత్రి సుచరిత సంచలనం: అనుమతి కోరితే ఆధారాలు చూపాలి

గ్యాస్ లీకైన ట్యాంకర్ మినహా ఇతర ట్యాంకర్లను దక్షిణ కొరియాకు తరలించామని హైకోర్టుకు ఎల్జీ పాలీమర్స్ నివేదిక ఇచ్చింది. నేషనల్ గ్యాస్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రూ. 50 కోట్లను జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసినట్టుగా తెలిపారు.

ఏదో ఒక సంస్థతో విచారణ జరిపించాలని ఎల్జీ పాలీమర్స్ సంస్థ హైకోర్టును కోరింది. ఈ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఈ నెల 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో స్టెరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం  కోటి రూపాయాలను పరిహారంగా చెల్లించింది.