అమరావతి: సమాజంలో మద్యం ఒక క్యాన్సర్ గా, అంటువ్యాధిగా ప్రబలుతుందని డిప్యూటీ సీఎం శంకర నారాయణ ఆరోపించారు. మద్యంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆలోచనా విధానం ఏంటో తమకు తెలియడం లేదన్నారు. 

రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే మద్యం తాగాలంటూ చంద్రబాబు, లోకేష్ ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మద్యపాన నిషేధానికి టీడీపీ మద్దతు ఇస్తుందో ఇవ్వడం లేదో చెప్పాలని డిప్యూటీ సీఎం శంకర నారాయణ నిలదీశారు. 

ఈ సందర్భంగా మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం శంకర నారాయణ. ఉమాకు మతిస్థిమితం లేదని ఆరోపించారు. మద్యపాన నిషేధంలో వచ్చే డబ్బంతా జగన్ కు చేరుతుందన్న ఉమా వ్యాఖ్యలు చూస్తుంటే బుర్ర పనిచేయడం లేదనిపిస్తోందన్నారు. ప్రభుత్వ బార్లు, ప్రభుత్వం నిర్వహిస్తోంది అలాంటప్పుడు ఆ సొమ్ము ప్రభుత్వానికి చేరకుండా జగన్ కు ఎలా వెళ్తుందని నిలదీశారు. 

దేవినేని ఉమామహేశ్వరరావు బంధువులుకే అత్యధికంగా బార్ల షాపులు ఉన్నాయని స్పష్టం చేశారు. దేవినేని ఉమా మహేశ్వరరావుకు బార్లు లేవని చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రంలో సగానికిపై గా తెలుగుదేశం పార్టీ నేతలకే బార్లు ఉన్నాయని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం శంకర నారాయణ. 

చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతమందికి ఒకేసారి ఐదేళ్లకు సంబంధించి లైసెన్స్ ఇచ్చారో అన్నది అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు అనుచరులు ఇబ్బందులు కలగకూడదనే అక్కసుతో మద్యంపాన నిషేధం ఆపేయాలని ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జగన్ మద్యపాన నిషేధం చేసి తీరతారని డిప్యూటీ సీఎం శంకరనారాయణ స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మందుబాబులకు జగన్ షాక్: మద్యం ధరల పెంపు