అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కేర్ టేకర్ గా చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే సమీక్షలు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. 

అందువల్లే సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ పనులపై పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్నికల అనంతరం అమరావతిలో జరిగిన హోంశాఖపై సమీక్షలో పాల్గొన్న చినరాజప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగానే ఉందని చెప్పుకొచ్చారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ బాగుందని చెప్పలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుతో జరిగిన రివ్యూలో చినరాజప్పతోపాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరోవైపు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు చినరాజప్ప. వివేకానందరెడ్డి వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లోనే హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఎలా దాడి చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చినరాజప్ప స్పష్టం చేశారు.  

ఇకపోతే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రతిపక్ష హోదా డౌటేనన్నారు. వైఎస్ జగన్ తన ఓటమిని ముందే అంగీకరించారని చెప్పుకొచ్చారు. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఈసారి 110 నుంచి 120 సీట్లు రావడం ఖాయమన్నారు. కచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు.