ప్రధాని నరేంద్రమోడీపై ఫైరయ్యారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి..ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధఇ కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు 10 శ్వేతపత్రాలను విడుదల చేశామన్నారు..

ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ప్రధాని గుంటూరు పర్యటనను వాయిదా వేసుకుని బీజేపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశప్రజలు కేంద్రంలో మార్పును కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇంటికి వెళ్లడం ఖాయమని కృష్ణమూర్తి జోస్యం చెప్పారు.

పార్లమెంట్‌లో రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడుతున్న తెలుగుదేశం ఎంపీలను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్ కూడా ఢిల్లీ పెత్తనం మీదే ఎదురుతిరిగారని కేఈ గుర్తు చేశారు. న్యాయమైన హక్కులను అడిగితే అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అలాగే ఓట్లు చీల్చి బీజేపీయేతర కూటమిని దెబ్బతీసేందుకే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారని, కేసుల నుంచి ఉపశమనం కోసమే వైసీపీ అధినేత జగన్ బీజేపీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ దేశ ప్రధానిలా కాకుండా గుజరాత్‌కి మాత్రమే ప్రధాని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.