అమరావతి: అమరావతిలోనే రాజధాని ఉండాలని కేంద్రం కోరుకోవడం లేదని ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

మంగళవారం నాడు ఆయన  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.13 జిల్లాల అభివృద్ది కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. రాజధాని విషయంలో బీజేపీ సూచనలపై ఆలోచిస్తామని చెప్పారు.

ప్రజలకు ఏది మంచిదైతే అది చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది.
మూడు రాజధానుల అంశాన్ని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు 360 రోజులకుపైగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విపక్షాలు అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుతున్నాయి వైసీపీ మాత్రం మూడు రాజధానులకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ  అమరావతి రైతులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సాగుతోంది.

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం  ప్రకటించిన విషయం తెలిసిందే.