ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై  విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలకు ఉపముఖ్య మంత్రి చినరాజప్ప కౌంటర్ ఇచ్చారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని సైతం రోడ్డుపైకి లాగాన్న వైసీపీ, బీజేపీ నేతల ప్రయత్నాలు సరికాదని హితవు పలికారు. 


తిరుమల విషయంలో టీడీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ ఒప్పందం కుదుర్చుకుని టీడీపీని  టార్గెట్ చేస్తున్నారని చినరాజప్ప విమర్శించారు. అసలు విజయసాయిరెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని, 12 కేసుల్లో ఏ-2 ముద్దాయని చినరాజప్ప పేర్కొన్నారు.

 సీఎం చంద్రబాబు గురించి దేశ ప్రజలందరికీ తెలుసునని, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని నేత అని మంత్రి పేర్కొన్నారు. జగన్‌కు ఉన్న తపన ఒక్కటేనని.. ఎవరు ఏమైపోయినా పర్వాలేదని, తనకు ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశతో ఉన్నారని చినరాజప్ప విమర్శించారు. టీడీపీ పాలనలో తప్పు జరగడానికి అవకాశాలు లేవని, రమణ దీక్షితులు 30 ఏళ్లుగా టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేశారని, ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, ఏదో దురుద్దేశంతో ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.