విజయవాడ: వింత వ్యాధికి గురౌతున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని చెప్పారు.గురువారం నాడు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వింత వ్యాధి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

also read:ఏలూరు వింత వ్యాధి: మరో ఇద్దరు మృతి, నాలుగు కొత్త కేసులు

ఆసుపత్రిలో చికిత్స అందుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకొన్నారు.. ఏలూరు నుండి 25 మందిని విజయవాడకు తరలించారు. వీరిలో ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించినట్టుగా మంత్రి తెలిపారు.

ఒకరు కరోనాతో మరొకరు గుండెపోటుతో మరణించారని మంత్రి వివరించారు. ఏలూరులోని మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయిస్తున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

రేపు సాయంత్రానికి అన్ని సంస్థల పరీక్షల ఫలితాలు రానున్నాయన్నారు. భాదితుల రక్తనమూనాల్లో సీసం, నికెల్ అవశేషాలను గుర్తించినట్టుగా చెప్పారు.

ఈ లోహాలు మనిషి శరీరంలోకి ఎలా ప్రవేశించాయనే దానిపై అధ్యయనం జరుగుతోందన్నారు. వింత వ్యాధి కేసులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.