Asianet News TeluguAsianet News Telugu

ఊడిగం చేయించుకుని ఇప్పుడు మెుసలికన్నీరా: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఫైర్

ఇచ్చిన హామీ ప్రకారం రూ. 8,600 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.6000 తీసుకునేటట్లు సీలింగ్ విధానాన్ని అమలు చేశారని విమర్శించారు. గత జనవరిలో సీలింగ్ విధానాన్ని ఎత్తివేస్తామంటూ మరో జీవో జారీ చేశారని ఆ తర్వాత జీతాలే ఇవ్వలేదని తిట్టిపోశారు.  
 

ap deputy cm alla nani fires on tdp
Author
Amaravathi, First Published Jul 18, 2019, 3:14 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. ఆశావర్కర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ మెుసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. ఆశావర్కర్ల చేత ఊడిగం చేయించుకుని ఆ తర్వాత వారిని గాలికొదిలేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని నిలదీశారు.

ఆశావర్కర్లపై టీడీపీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే గత జనవరి నుంచి జూన్ నెల వరకు ఎందుకు జీతాలు చెల్లించలేదో చెప్పాలని నిలదీశారు. కనీసం కేంద్రప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ ను కూడా పక్కదారి పట్టించారంటూ విరుచుకుపడ్డారు. 

రాష్ట్రంలో 43,046 మంది ఆశావర్కర్ల ఉంటే వారందరినీ రోడ్డుమీదకు ఈడ్చింది తెలుగుదేశం పార్టీ కాదా అని నిలదీశారు. ఆశావర్కర్ల జీవితాలతో చెలగాటమాడుకున్నారని విమర్శించారు. ఆశావర్కర్లకు తానేదో చేస్తున్నట్లు గొప్పలు చెప్తూ గత ఆగష్టులో జీతాలు రూ.3000 చేస్తున్నట్లు ప్రకటించారని కానీ దాన్ని కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. 

ఆశావర్కర్లకు గౌరవ వేతనం రూ.3వేలు కేంద్రప్రభుత్వ ఇన్సెంటివ్స్ రూ. 5,600 అంటూ ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ హామీని హామీగానే వదిలేసిందన్నారు. అయితే ప్రకటన విడుదల చేసినప్పుడు జీవోలో తిరకాసు పెట్టి వారి జీతాలను దోచుకుందని విమర్శించారు. 

ఇచ్చిన హామీ ప్రకారం రూ. 8,600 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.6000 తీసుకునేటట్లు సీలింగ్ విధానాన్ని అమలు చేశారని విమర్శించారు. గత జనవరిలో సీలింగ్ విధానాన్ని ఎత్తివేస్తామంటూ మరో జీవో జారీ చేశారని ఆ తర్వాత జీతాలే ఇవ్వలేదని తిట్టిపోశారు.  

తమ ప్రభుత్వం ఆగష్టు నెల నుంచి ఆశావర్కర్లకు నెలకు రూ.10వేలు గౌరవ వేతనంతోపాటు కేంద్రం ఇన్సింటివ్ ను సైతం పెంచుతున్నట్లు తెలిపారు. ఇకపోతే వైసీపీ నేతల బెదిరింపులతో ఆశావర్కర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు.  

మచిలీపట్నంకు చెందిన జయలక్ష్మి అనే ఆశావర్కర్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. ఒకవైపు ఆశావర్కర్ గా పనిచేస్తూనే ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారని చెప్పారు. 

అంతేకాదు జన్మభూమి కమిటీలో సభ్యురాలిగా జయలక్ష్మి పనిచేశారని అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయని తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలర్ గా కూడా పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారని చెప్పుకొచ్చారు. 

ఆమె నిద్రమాత్రలు మింగిన ముందు రోజు తన ఆశావర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాలతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడితే అది వైసీపీ వైపు నెట్టి రాజకీయం చేయాలని చూస్తోందని డిప్యూటీ సీఎం ఆళ్లనాని మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios