Asianet News TeluguAsianet News Telugu

స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు... కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ కీలక ఆదేశాలు

 ఈనెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల బందోబస్తు తదితర అంశాలపై సీఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

AP CS Adityanath Das Video Conference with District Collectors and SPs over Localbody Votes Counting
Author
Amaravati, First Published Sep 17, 2021, 1:25 PM IST

విజయవాడ: చాలారోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరిగినా కోర్టు ఆదేశాలతో ఫలితాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల బందోబస్తు తదితర అంశాలపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, డిపిఓలు,  జడ్పి సిఇఓ సహా ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ వీడియో సమావేశం నిర్వహించారు. విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఈ వీడియో సమావేశం జరిగింది. 

ఈ వీడియో సమావేశంలో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ మాట్లాడుతూ... ఈనెల 19న నిర్వహించే జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు మార్గదర్శకాలను ఇచ్చారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లు, ఎస్పిలను ఆయన ఆదేశించారు. ఆలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు.

వీడియో

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ లను సిఎస్ ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జిగా పెట్టాలని సిఎస్  కలెక్టర్లును ఆదేశించారు.

ఈవీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios