అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలిపారు సీపీఎం నేత మధు. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సీపీఎం నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

రాష్ట్రంలో నెలకొన్న అంగన్ వాడీ, రైతు సమస్యలు, ప్రతిపక్షాలపై గతంలో పెట్టిన కేసులు తొలగించాలని కోరినట్లు సీపీఎం నేత మధు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో పెట్టిన కేసులన్నింటిని ఎత్తివేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కూడా జగన్ ను కోరినట్లు తెలిపారు. మరోవైపు అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న మధ్యాహ్నా భోజనాన్ని నిలిపివేయాని కోరినట్లు తెలిపారు. అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న భోజనంలో సరైన పోషకాలు లేవన్నారు. 

కాంట్రాక్టు ఉద్యోగులు, అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని జగన్ ను కోరినట్లు తెలిపారు. అలాగే విద్యుత్‌ రంగాల్లో యూనియన్ల గురించి సీఎం జగన్ తో చర్చించినట్లు తెలిపారు. తాము లేవనెత్తిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సైతం సీఎం జగన్ ను కలిశారు. 352 పాఠశాలల్లో 2600 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు పద్ధతిలో 14 ఏళ్లుగా పనిచేస్తున్నట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి అలవెన్సు లేకుండా, తక్కువ జీతానికి తాము పనిచేస్తున్నట్టు తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరినట్లు తెలిపారు.