విజయవాడ: కరోనా  వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే కాదు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మహమ్మారిపై పోరాడుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే కేరళలో ప్రభుత్వం కరోనా నివారణకు అద్భుతంగా పనిచేస్తోంది. 

ఇదే విషయాన్ని ఏపి  సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేరళ తరహాలో ప్రత్యెక ప్యాకేజీని ప్రకటించాలని సూచించారు. 

read more  మరింత తీవ్రరూపంలోకి కరోనా... తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ కేసు

కరోనా వలన ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని... ప్రజలు ఇల్లు వదిలి రావాలంటేనే భయపడే భయంకరమైన పరిస్థితి నెలకొని వుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీతో ఐక్యంగా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దమైందన్నారు. రరూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి కరోనాను కంట్రోల్ చేయడంలో మంచి ఫలితాలను సాధించిందని అన్నారు. 

అక్కడి ప్రజలందరికీ నెలకు 10 కేజీల ఉచిత బియ్యం, రూ.20 లకే భోజన సదుపాయం, అవసరమైన వారికి రుణాల మంజూరుకు రూ.2 వేల కోట్లు తదితర సహాయక చర్యలకు ఉపక్రమించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ నిధులు ప్రకటించి, పేద, సామాన్య, మద్య తరగతి ప్రజానీకానికి విపత్కర పరిస్థితుల్లో అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపట్టాలని రామకృష్ణ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.