విజయవాడ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ఇతర రాష్ట్రాలలో అత్యధిక శాతం ప్రాంతీయ పార్టీలు పాలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా పాలించింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ విభజన పుణ్యమా అంటూ ఏపీలో బొక్క బోర్లాపడింది. 

రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ నాయకులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు అంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. 

దీంతో ఏపీపై కాంగ్రెస్ పార్టీ ఆశలకు నీళ్లు వదిలేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుందని తాము ఏమీ ఆశించడం లేదంటూ ఖరాఖండిగా చెప్పేశారు రాహుల్. 

అయితే నవ్యాంధ్రప్రదేశ్ లో కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆపద్భాంధవుడిలా చేయందించారు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బోర్లాపడ్డ చేతిని సైకిలెక్కించుకుని శస్త్రచికిత్స చేయించేందుకు రెడీ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కొంత ఆశలు చిగురించాయనే చెప్పాలి. 

విభజన ఫలితంగా ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. దశాబ్ధకాలంపాటు ఆ మంట చల్లారే పరిస్థితులు లేవని అటు రాజకీయ వర్గాలు, ఇటు మేధావి వర్గం అంచనావేస్తోంది. అంటే ఏపీలో ఓటు బ్యాంకును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి శ్వాస తీసుకోవడమూ కష్టమేననుకుంది. 

ఈ తరుణంలో చంద్రబాబు చేయూత ఆ పార్టీకి ఊపిరిపోస్తుందని భావించాలి. చంద్రబాబు అండతో నెమ్మదిగా పాగా వెయ్యాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. 

ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పై సర్వహక్కులు చంద్రబాబుకే రాహుల్ గాంధీ అప్పగించినట్లు గుసగుసలు వినబడుతున్నాయి కూడా. 

ఏపీలో పొత్తులపై ఇప్పుడే చర్చలు ఎందుకు అని కొంతమంది, పొత్తులు తెలంగాణ వరకే పరిమితం అని ఏపీలో టీడీపీకి ఎవరితోనూ పొత్తు అవసరం లేదని మరికొందరు ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ఖచ్చితంగా చెప్తోంది. 

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జరిగే పరిణామాలపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశంల చర్చించారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని కొన్ని నియోజకవర్గాలను నాయకు వదులు కోవాల్సి ఉంటుందని త్యాగాలు చెయ్యాలంటూ మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు. 

అంతేకాదు ఒక వేళ పొత్తు ఉంటే ఎక్కడఎక్కడ గెలుస్తాం, గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, టీడీపీకి ఏం అల్టిమేటమ్ ఇద్దాం అన్న అంశాలపై కూడా రఘువీరా ఆరా తీశారు. అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. 

గెలవగలిగే స్థానాలను గుర్తించాలని కూడా ఆదేశించిందని అందువల్లే రఘువీరా అలాంటి వ్యాఖ్యలు చేశారంటూ జోరుగా చర్చ జరుగుతుంది. తొలుత ఎంపీ స్థానాలపై దృష్టి పెట్టాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. ఏపీలో ఎలాగూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి కేంద్రంలో అయినా అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది. 

అటు చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంలో బీజేపీ పాలనను గద్దె దించాలని బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని అందుకు ఎంత సహకారం అయినా చేస్తానని ఇప్పటికే ప్రగల్భాలు పలికారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలపై దృష్టిసారించింది. 

కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీగా పనిచేసిన వాళ్లు, కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు ఉండే నియోజకవర్గాలు, రాజకీయ నేపథ్యాలను పరిగణలోకి తీసుకుని ఏడు పార్లమెంట్ స్థానాలను లెక్కలోకి తేల్చినట్లు తెలుస్తోంది.  
 
రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఏడు పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, కర్నూలు, రాజంపేట, విశాఖపట్నం, అరకు, తిరుపతి, కాకినాడ స్థానాలపై టీడీపీని కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశముంది. 

అయితే కాంగ్రెస్ కోరుతున్న ఈ ఎంపీ స్థానాల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలు ఉండటం విశేషం. అంతేకాదు టీడీపీలో ఎంపీ స్థానాలను ఆశించి ఇతర పార్టీల నుంచి వచ్చిన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో కింజరపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 

కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీ నుంచి గెలిచినా టీడీపీతో అనుబంధంగా ఉన్నారు. ఇకపోతే రాజంపేట, విశాఖపట్నం స్థానాలను గతంలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఆ స్థానాల్లో ఇప్పటికే కొంమంది టీడీపీ నేతలు కర్చీఫ్ వేసుకున్నట్లు తెలుస్తోంది.  

అయితే తిరుపతి పార్లమెంటు సీటుపై మాత్రం కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వరప్రసాద్ గెలుపొందారు. ఈ స్థానాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. చింతా మోహన్ ఇక్కడ గతంలో గెలిచారు కూడా. ఈ నేపథ్యంలో చింతా మోహన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు టీడీపీ సుముఖంగా ఉండే అవకాశం ఉంది. 

ఇక మరో నియోజకవర్గం రాజంపేట. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవ్వగా వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు ఇచ్చేందుకు కూడా టీడీపీకి పెద్దగా సమస్యలు లేవని తెలుస్తోంది.  

అటు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే సిట్టింగ్ టీడీపీ ఎంపీ తోట నరసింహం ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచి రాష్ట్రమంత్రి అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తాను పార్లమెంట్ కు పోటీ చెయ్యబోనని సీఎం చంద్రబాబుతో అన్నట్లు కూడా తెలుస్తోంది. 

తోట నరసింహం పోటీ చెయ్యకపోతే డిప్యూటీ సీఎం ఏపీ హోం శాఖ మంత్రి చినరాజప్పను ఎంపీగా బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. చినరాజప్పను బరిలోకి దించితే గెలుపోటములు పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సీటును కాంగ్రెస్ పార్టీ అడిగితే ఇచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని ప్రచారం జరుగుతుంది. 

కాకినాడ నుంచి కాంగ్రెస్ తరుపున మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు బరిలోకి దిగే అవకాశం ఉంది. రాజకీయ కుటుంబ నేపథ్యం ఒకవైపు, వివాద రహితుడుగా మంచి పేరు ఉండటంతో ఆయనకు సీటు ఇచ్చి టీడీపీ బలపరిస్తే ఆయన విజయం నల్లేరుపై నడకేనని కాంగ్రెస్ చెప్తోంది. 
 
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీ టీడీపీ సానుభూతి పరురాలు బుట్టా రేణుక ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆమె టీడీపీకి అనుబంధంగా ఉంటున్నారు. ఈసారి టీడీపీ తరుపున తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతునన్నారు.  

అయితే బుట్టా రేణుకకు ఈసారి అవకాశం కష్టమేనని తెలుస్తోంది. ఆమెను పార్లమెంట్ కు కాకుండా అసెంబ్లీకి పంపాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దించాలని చంద్రబాబు ఆలోచన. ఇప్పటికే ఆమెకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కర్నూలు ఎంపీ స్థానం సైతం కాంగ్రెస్ కోరుతుంది. అయితే ఈ స్థానం ఇచ్చేందుకు ఎలాంటి ఢోకా లేదని టీడీపీ నుంచి లీకులు వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కర్నూలు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి  పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు సీటు ఇచ్చేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇకపోతే విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సైతం కాంగ్రెస్ ఆశిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ చేసి గెలుపొందారు. అయితే బీజేపీతో పొత్తు రద్దు అయిన నేపథ్యంలో ఈసీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు అభ్యంతరం ఉండకపోవచ్చునని ప్రచారం. ఇకపోతే విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. 

కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈనియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గుమ్మడి సంధ్యారాణి, వైసీపీ తరుపున కొత్తపల్లి గీతలు పోటీ చెయ్యగా కొత్తపల్లి గీత గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఆమె టీడీపీకి అనుబంధంగా కొనసాగారు. మూడు నెలల క్రితం ఆమె సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు. ఇకపోతే ఈసారి పార్లమెంట్ స్థానానికి పోటీ చెయ్యబోనని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అరకు స్థానాన్ని కాంగ్రెస్ కు ఇచ్చే విషయంలో  ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు.  

కాంగ్రెస్ ఆశించే మరో స్థానం శ్రీకాకుళం ఎంపీ స్థానం. అయితే ఈ స్థానాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. అక్కడ సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఆయన్ను తప్పించే అంత సాహసం చంద్రబాబు చెయ్యరని ప్రచారం జరుగుతోంది. 

ఏపీలో పొత్తులపై ఎలాంటి ప్రకటన రాకుండానే కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాము ఆశించిన స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆశపడుతున్నారు. త్వరలో ఏపీలో జరగబోయే ధర్మపోరాట దీక్షకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. ఆ రోజున పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.