అమరావతి: తెలంగాణలో మాదిరిగానే ఏపీలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ పొత్తు విషయమై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలను తెలుసుకొనేందుకు  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలతో గురువారం నాడు చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పొత్తులకు సుముఖంగా ఉన్నా ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలతో పాటు టీజేఎస్, సీపీఐలు కూడ కలిసి పీపుల్స్ ఫ్రంట్ పేరుతో పోటీ చేశాయి.

ఇదే తరహాలో ఏపీలో కూడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందనే కోపంతో 2014 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా ఆ రాష్ట్ర ఓటర్లు  దెబ్బకొట్టారు.

దీంతో రానున్న ఎన్నికల్లో  టీడీపీతో కలిసి పోటీ చేయాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు చెందిన పార్టీల కన్వీనర్లతో  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చర్చించింది.  స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పార్టీ నాయకత్వం తెలుసుకొంది.

ఏపీలో టీడీపీతో పొత్తు విషయమై చర్చించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ చాందీతో పాటు  కీలక నేతలు గురువారం నాడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో టీడీపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే 100 అసెంబ్లీ, 15 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సంసిద్దతతో ఉంది.ఇదిలా ఉంటే టీడీపీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆసక్తిగా ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రతిపాదన రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత మరింత స్పష్టత రానుంది.