కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ అల్లర్లు సృష్టించిన వారి ఆస్తులను జప్తు చేయనున్నట్లు డిఐజి పాలరాజు ప్రకటించారు. అల్లర్ల నష్టాన్ని నిందితుల నుండి రాబట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమలాపురం: ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో అలజడి నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. రాజ్యాగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కొనసీమ జిల్లాకు జతచేయడాన్నివ్యతిరేకిస్తూ అలజడి సృష్టించినవారిపై అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు తెలిపారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న మరో 25మందిని గత శనివారం అరెస్ట్ చేసినట్లు డిఐజి తెలిపారు. ఈ నిందితులను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలో డిఐజి కీలక వ్యాఖ్యలు చేసారు.
అమలాపురం ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని డిఐజి తెలిపారు. మొత్తం 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా అమలాపురంలో అల్లర్లకు పథకరచన జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులు ఈ అల్లర్లలో ధ్వంసమయ్యాయని... ఈ నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని అన్నారు. ఇందుకోసం నిందుతుల ఆస్తులను సీజ్ చేయనున్నట్లు డిఐజి పాలరాజు హెచ్చరించారు.
అమలాపురంలోని సిసి కెమెరాల్లో రికార్డయిన పుటేజ్, అల్లర్ల సమయంలో పోలీసులు, మీడియా వీడియోలు, టవర్ లొకేషన్ లాంటి సాంకేతిక ఉపయోగించి నిందితుల గుర్తించాలమని డిఐజి తెలిపారు. ఇలా గుర్తించిన నిందితుల్లో ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నామని... శనివారం మరో 25మందిని అరెస్ట్ చేసినట్లు డిఐజి వెల్లడించారు. ఇవాళ (ఆదివారం) మరికొందరు నిందితులను అరెస్ట్ చేయనున్నట్లు పాలరాజు తెలిపారు.
ఇక ప్రస్తుతం అమలాపురంలో కొనసాగుతున్న 144 సెక్షన్ మరో వారంరోజులు పొడిగించనున్నట్లు డిఐజి తెలిపారు. అలాగే ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం జరగకుండా ఇంటర్నెట్ సేవలు మరో రోజు నిలిపివేయనున్నట్లు డిఐజి పాలరాజు వెల్లడించారు.
అమలాపురంలో అల్లర్లకు ముందస్తుగానే వాట్సాప్‌లో చర్చించుకున్నారని డిఐజి పాలరాజు పేర్కొన్నారు. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఏమేం చేయాలో చర్చించుకున్నారని డీఐజీ వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లను కూడా అరెస్ట్ చేస్తున్నామని పాలరాజు చెప్పారు.
అమలాపురం అల్లర్లకు రౌడీ షీటర్లే కారణమని ఆయన పేర్కొన్నారు. అల్లర్లలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించామని, ఆదివారం మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తామని డీఐజీ వెల్లడించారు. అరెస్టులు ముగిశాక దశలవారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని పాలరాజు స్పష్టం చేశారు.
కాపు ఉద్యమనేత నల్లా సూర్య చంద్రరావు కుమారుడు అజయ్ సహా చాలామందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో అమలాపురంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరికొందరిపై కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. సామర్లకోటకు చెందిన వజ్ర పోలీస్ వాహనం డ్రైవర్ వాసంశెట్టి సుబ్రమణ్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
