Asianet News TeluguAsianet News Telugu

వరదలపై జగన్ సమీక్ష : తక్షణ సాయం కుటుంబానికి రూ.5వేలు

వరద ప్రభావంతో ఇళ్లునష్టపోయినా, పంట నష్టపోయినా వాటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు.  


 

ap cm ys jaganmohanreddy review on godavari flood effected areas
Author
Rajamahendravaram, First Published Aug 8, 2019, 4:46 PM IST

రాజమహేంద్రవరం: గోదావరి వరద బాధితులకు అందుతున్న సహాయక కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంపుబాధిత కుటుంబాలకు అందుతున్న సహాయంపై ఆరా తీశారు. 

రాజమహేంద్రవరంలోని ఏటీసీ టవర్ బిల్డింగ్ లో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మంత్రులు కురసాల కన్నబాబు, విశ్వరూప్, అనిల్ కుమార్ యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్ కుమార్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో తల్లడిల్లుతున్న బాధితులకు ప్రస్తుతం ఇస్తున్న సహాయంతోపాటు అదనంగా రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి భోజనాలు, నిత్యావసర వస్తువుల పంపిణీయే కాకుండా రూ.5వేలు సహాయంగా అందించాలని జగన్ ఆదేశించారు. 

వరద ప్రభావంతో ఇళ్లునష్టపోయినా, పంట నష్టపోయినా వాటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు.  

వరదల కారణంగా వారి జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నందు వల్ల వారికి తాత్కాలిక ఊరట కలిగించేందుకు రూ.5వేలు ఉపయోగపడతాయని తెలిపారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.  


ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీచేయాలని ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం కాకుండా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని సూచించారు.  

పోలవరం ప్రాజెక్టుకోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు కూడా వరదల కారణంగా దెబ్బతింటే ఆ బాధితులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాల సబ్సిడీ రూపంలో అందిచాలని కోరారు.  

ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన ఉన్న దేవీపట్నం మండలంతో సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. గోదావరిలో 10–11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేదికాదని, కాని ఈసారి ముంపు ఎక్కువగా ఉందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు.  

అంతలా నీరు వచ్చి చేరడానికి గల కారణాలపై జగన్ ప్రశ్నించగా కాఫర్ డ్యాం కారణంగా ముంపు పెరిగిందని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.  

ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణలోకి తీసుకుని, దానికి  అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.  

వచ్చే వరద, ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. త్వరగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. 


పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి వీలుగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. 
తక్షణమే ఆ అధికారి బాధ్యతలు తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తారని చెప్పుకొచ్చారు.  

ఇకపోతే అంతకుముందు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.  

అంతకు ముందు రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం జగన్ నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios