న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తినలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలనే అజెండాతో కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కోరారు.  

రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులు, విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలుపై నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ సర్వం కోల్పోయిందని కేంద్రమే ఆదుకోవాలంటూ జగన్ కోరారు. 

ఇకపోతే రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. 

అంతకు ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కలిశారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యా నాయుడుతో జగన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవాల్సి ఉన్నా సమయం కుదరకపోవడంతో కలవలేకపోయారు సీఎం జగన్.