అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్నారా....? కేసీఆర్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాసాధికార సర్వేను జగన్ కాపీ కొడుతున్నారని తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు అనర్హులైన వారిని ఏరివేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ స్మార్ట్ పల్స్ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగా వ్యక్తుల ఆధార్ కార్డు ఆధారంగా అన్ని వివరాలు సేకరించారు. 

తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజాసాధికార సర్వేను ఇఫ్పుడు సీఎం జగన్ వైయస్ఆర్ నవశకం పేరుతో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 20 వరకు సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు. రాష్ట్రంలోని వాలంటీర్లు ప్రతీ ఇంటింటికి తిరిగి సర్వే చేయడమే వైయస్ఆర్ నవశకమని తెలుస్తోంది.   

వాలంటీర్లు ప్రజల యెుక్క పూర్తి వివరాలను సేకరించిన అనంతరం ఆ సర్వే డేటాను అంతా ఆన్లైన్ చేస్తారు. ఇక ప్రతి సమాచారం ఆధార్ లింక్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఆధార్ నంబర్ తో ప్రజల శాశ్వత చిరునామాతోపాటు పూర్తి వివరాలు వచ్చేలా ఆన్లైన్ లో పొందుపరుస్తారు.  

వైఎస్సార్ నవశకం పేరిట ఇంటింటి సర్వే: అనర్హుల ఏరివేతే లక్ష్యం

తెలంగాణ సీఎం కేసీఆర్ అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందకూడదు ప్రతీ తెలంగాణ పౌరుడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రజాసాధికార సర్వే నిర్వహించారు. అదే లక్ష్యంతో సీఎం జగన్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే దానికి అదనంగా మరోక కొత్త లింక్ పెట్టారు సీఎం జగన్. 

 నాలుగు రకాలైన గుర్తింపు కార్డ్ లు, 7 రకాల పథకాల కోసమే వైయస్ఆర్ నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ ప్రభుత్వం చెప్తోంది. వైయస్ఆర్ నవశకం సర్వే ద్వారా వచ్చిన వివరాలతోనే రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ దుకాణం ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఉగాది నాటికి ఇళ్ల స్థలం, ఇంటి రుణం, ఇతర రాష్ట్రాల్లో కూడా వినియోగంలోకి వచ్చే ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అమల్లోకి తేనున్నట్లు చెప్తోంది.  

వాస్తవానికి ఇదొక సమగ్ర కుటుంబ సమాచార సేకరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి వ్యక్తి యొక్క పూర్తి సమాచారం ఇకపై ఆధార్ తో అనుసంధానించబడి ప్రభుత్వ గణాంకాల్లో నిర్లిప్తమై ఉంటుంది. ఈ సర్వేలో అతి ముఖ్యమైనది రేషన్ కార్డు. 

ఎవరు నిరుపేదలు అని గుర్తించేందుకు కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలతోపాటు ప్రపంచ ఆర్థిక గణాంకాలకి ప్రామాణికంగా రేషన్ కార్డును వినియోగిస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే నిరుపేదలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే సంక్షేమ పథకాలకు అర్హులని నిర్ణయిస్తారు.  

ఇకపోతే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటి సారిగా పల్స్ సర్వే నిర్వహించింది. అయితే ఆ సర్వే తప్పుల తడకగా ఉండటంతో వైయస్ఆర్ నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వాలంటీర్ రోజుకు 5 ఇల్లుయెుక్క పూర్తి సమాచారాన్ని సేకరించి సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.