కాకినాడ: ఎంతమంది శత్రువులు ఏకమైనా, ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతానని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ ప్రజలకోసం గొప్పగొప్ప పనులు చేస్తున్నా నిందలు వేస్తున్నారంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.  

ఎన్నో అపనిందలు వేస్తున్నారని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకోసం చేయదగ్గ మంచిని మీ బిడ్డగా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. 
ఎంతమంది శత్రువులు ఏకమైనా ఎన్ని కుతంత్రాలు పన్నినా తట్టుకుని నిలబడగలగుతానని తెలిపారు.  

అంతకుముందు ముమ్మిడివరం నియోజకవర్గంలోని పశువుల్లంక వైయస్ఆర్ వారధిని ప్రారంభించారు సీఎం జగన్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.  

ప్రభుత్వం చేస్తున్న పనులను అభినందించాల్సింది పోయి అపనిందలు వేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్‌ ఎలాంటి చెడు చేయడని తెలిసి ప్రజలను మభ్యపెట్టేందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  

వెనకబడ్డ తరగతులు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని బ్యాక్‌ బోన్‌గా మార్చాలని తాను తాపత్రయపడుతున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే వెనకబడ్డ వారు కాదని వాళ్లని ముందుకు తీసుకెళ్లాలనే తపనతో అహర్నిశలు శ్రమిస్తున్నట్లు జగన్ తెలిపారు. 

తాను అలా ఆరాటపడటమే తాను చేసిన తప్పు అన్నట్టుగా విపక్షాలు దుష్ప్రచారం చేయడం చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు. ఇలా తప్పుగా మాట్లాడుతున్న నాయకుల్ని, తప్పుగా మాట్లాడుతున్న పత్రికాధిపతుల్ని ప్రజలే ప్రశ్నించాలని సూచించారు.  

అయ్యా! మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో గట్టిగా నిలదీయండంటూ జగన్ సూచించారు. మీకేమో ఇంగ్లిషు మీడియం, మా పిల్లలకేమో తెలుగుమీడియం అనడం భావ్యమేనా అని ప్రశ్నించాలంటూ జగన్ పిలుపు ఇచ్చారు. 

వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి అపనిందలు వేసినా, విమర్శలు చేసినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాలు తనకు ఉన్నంతకాలం ప్రజలకు మంచి చేస్తూనే ఉంటానని జగన్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆయన ఆశీస్సులతో ప్రతి హామీ నేరవేరస్తున్నాం.. సీఎం జగన్