దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం జగన్ ట్వీట్ చేశారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ పరిహారం రూ.10వేలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే డీజిల్‌ సబ్సిడీ రూ.9కి పెంచామన్నారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు సాయం అందిస్తామన్నారు. ఇప్పటికే సీఎం జగన్ ముమ్మడివరం చేరుకున్నారు.

ఇదిలా ఉండగా.. మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. కాగా.. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలం మల్లవరంలోని గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌  చమురు, సహజవాయువు అన్వేషణకు సముద్రంలో డ్రిల్లింగ్‌ ప్రారంభించిన నేపథ్యంలో.. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని 16,654 మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారికి రూ.81 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. 

పరిహారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు పలుమార్లు ప్రదక్షిణలు చేసినా  పట్టించుకోలేదు. తమ సమస్యను పరిష్కరించాలని గాడిమొగలో జీఎస్‌పీసీ గేటు వద్ద మత్స్యకారులు 103 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. సుమారు 5 వేల బోట్లపై వేలాది మంది మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో చమురు సంస్థల పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిపై నాటి చంద్రబాబు సర్కార్‌ ఏమాత్రం సానుభూతి చూపలేదు.

రోజులు గడిచాయి... అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కరిస్తానని నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. వాస్తవానికి జీఎస్‌పీసీ ద్వారా పరిహారం అందించాల్సి ఉండగా ఆ సంస్థ తన ప్లాంట్‌ను ఓఎన్‌జీసీకి బదలాయించేసింది. పరిహారం ఇవ్వడానికి ఓఎన్‌జీసీ ముందుకు రాకున్నా తమ ప్రభుత్వమే అణాపైసలతో సహా బాధిత కుటుంబాలకు అందజేస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. నాడు ముమ్మిడివరంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.80 కోట్లు ఇవ్వడానికి ఇటీవల మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా మొత్తం పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.